Type Here to Get Search Results !

St Francis of Assisi Life



అక్టోబర్ 4వ తేదీ

పునీత అస్సిసీపుర ఫ్రాన్సిస్ గారి పండుగ

లోక రక్షకుడైన క్రీస్తు ప్రభువుని గురించి తెలియక, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, లోకము ఇచ్చే ధనము ఆనందము వ్యామోహం కీర్తి ప్రతిష్టల కొరకు ప్రాకులాడుతూ ఉన్న కొందరు.. క్రీస్తే నిజ దేవుడని తెలుసుకున్నాక వారి పూర్వ జీవితానికి స్వస్తి చెప్పి సర్వాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని క్రీస్తులో,క్రీస్తు ద్వారా మొదలుపెట్టి క్రీస్తు కొరకే జీవించి చివరికి క్రీస్తు కొరకే మరణించిన పునీతులైన వారందరూ శ్రీ సభలో ఉన్నారు అట్టివారిలో పునీత ఫ్రాన్సిస్ గారు ఒకరు.. ఈరోజు ఫ్రాన్సిస్ గారి పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన జీవితాన్ని గురించిన కొన్ని ముఖ్యమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలను గురించి తెలుసుకుందాం అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారు ఇటలీ దేశంలో అస్సీసి నగరంలో  పీటర్ బెర్నదోనె,పీకా దంపతులకు క్రీ.శ. 1182వ సం||లో జన్మించారు. తండ్రి బట్టల వ్యాపారి తల్లి దైవ భక్తురాలు తన తండ్రి  బట్టల వ్యాపార నిమిత్తం ఫ్రాన్స్ దేశం వెళ్లి తిరిగి వచ్చినప్పుడు అప్పుడే పుట్టిన తన కుమారుడుకి "ఫ్రాన్సిస్" అని నామకరణం చేశారు. ఫ్రాన్సిస్ అనగా ఫ్రాన్స్ నుండి స్వేచ్ఛ, ఉచితం అని అర్థం. ఫ్రాన్సిస్ గారికి జ్ఞాపకశక్తి మెండు చిన్న ప్రాయము నుండే ఎంతో చలాకీగా కలుపుగోలు తనంగా ఉండేవారు. ముఖ్యంగా వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఫ్రాన్సిస్ ఎంతో ఆహ్లాదనంగా ఆనందదాయకంగా మలచుకొనేవారు..

ఫ్రాన్సిస్ పెరిగి పెద్ద వాడగుచున్న కొలది చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఆకర్షణకు కారణమైన ప్రతి ప్రదర్శనకు ఆహ్వానం పలికే వాడు. పగలంతా దుకాణంలో వ్యాపారం చేస్తూ సాయంత్రానికి సంపాదించిన డబ్బుతో మిత్రులతో కలిసి సరదాలు చేసేవారు.. ఫ్రాన్సిస్ గారిని ఆయన స్నేహితులు "వినోదాల రాకుమారుడు" అని పిలిచేవారు .ఫ్రాన్సిస్ వారి బాల్యం, యవ్వనం సరదాలతో మిత్రులతో హాయిగా గడిచింది..

చెదరిన కల-:

ఫ్రాన్సిస్ గారికి జీవితమంటే కలలు కనడం, గొప్ప గొప్ప సాహసాలు చేయడం, ఫ్రాన్సిస్ గారు ఎప్పుడూ ఉత్సాహంతోను, ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. తన నమ్మకాలన్ని నెరవేరాలని తన కలలన్నీ వాస్తవాలు కావాలని పగలు ,రాత్రులు అదే ధ్యాసలో ఉండేవారు. అతనికి ఒకే ఒక ఆశయం యోధుడు కావాలని. ఏదో ఒకరోజు ఈ ఆశయం నెరవేర్చుకోవాలని ఆరాట పడుతూ ఉండేవారు..

అస్సీసి,పెరూజియ నగరాల మధ్య యుద్ధం వచ్చింది. ఇది తన కలల సాకారానికి మంచి అవకాశంగా భావించారు ఫ్రాన్సిస్.. నవంబర్ 1202వ సంవత్సరంలో పెద్దపెద్ద యోధులతో కలిసి యుద్ధం చేయటానికి తనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది..అస్సీసికి గొప్ప పేరు కీర్తిప్రతిష్టలు తీసుకొని వస్తాను అని వాగ్దానం చేసి యుద్ధభూమికి బయలుదేరారు.. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు "పెరూజియా" పట్టణం పై యుద్ధం చేసినప్పుడు బందీగా కొనిపోబడి ఒక సంవత్సరం పాటు చెరసాలలో ఉంచబడ్డారు.. ఖైదు  జీవితం ఒక సంవత్సరం గడిచిపోయింది ఆ తర్వాత అస్సీసి,పెరూజియా నగరాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుట వలన ఖైదీలందరు కూడా విడుదల చేయబడ్డారు.. ఖైదు జీవితం ఫ్రాన్సిస్ ను బాగా క్రుంగదీసింది. చెరసాల నుండి విడుదల పొందిన పిదప కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు తన తల్లి సేవలతో, అపారమైన  అనుభవము గల వైద్యుని సహాయము వలన ఫ్రాన్సిస్ పూర్తిగా జబ్బు నుండి కోలుకున్నారు..

దైవ పిలుపు-: జీవిత మలుపు-:

సంపూర్ణ ఆరోగ్యవంతుడైన తరువాత ఫ్రాన్సిస్ గారు అపూలియా పట్టణంపై యుద్ధానికి వెళ్తున్నారు... ఫ్రాన్సిస్ నీవు ఎక్కడికి వెళుతున్నావు అని ఒక స్వరం ఫ్రాన్సిస్ ను ప్రశ్నించింది.. అప్పుడు ఏదో శక్తి ఫ్రాన్సిస్ సమాధానం ఇచ్చినట్లు చేసినది. ప్రభూ! నేను అపూలియాకు యుద్ధభూమికి యోధుని కావాలని వెళ్లుచున్నాను అని ఫ్రాన్సిస్ బదులు చెప్పి ఉన్నారు..

"యజమాని కొరకు లేక సేవకుని కొరకు పోరాటం చేయడంలో ఏది ఉత్తమమో చెప్పు ఫ్రాన్సిస్ అని ఆ  స్వరం అడుగగా, "యజమాని కొరకు ఉత్తమం" అని ఫ్రాన్సిస్ బదులు పలికి యున్నారు.. అయితే సేవకుని కొరకు పోరాటం చేయుట ఆపు నీ ప్రభువును సేవకునిగా మార్చవద్దు అని ఆ స్వరం వినిపించింది .ఫ్రాన్సిస్ ఉలిక్కిపడి నేను సేవకుని కొరకు పోరాడుచున్నానా? అయితే ప్రభూ నేనేం చేయవలయును అని తిరిగి ప్రశ్నించారు.. అస్సీసి తిరిగి వెళ్ళు నువ్వు ఏమి చేయవలయునో అక్కడ నీకు తెలియజేయబడుతుంది అని ఆ స్వరం పలికి ఉన్నది...
తనకు కలిగిన ఈ దర్శనాన్ని అలవోకగా తీసి వేయలేదు ఫ్రాన్సిస్ గారు తన సైనిక వస్త్రాలను ఓ మిత్రునికి ఇచ్చి వేసి అస్సీసి నగరానికి తిరుగ ప్రయాణం ప్రారంభించారు.. అదే ఫ్రాన్సిస్ మారు మనసుకు మొదలు.. ఒక్కసారి క్రీస్తు ప్రభువు స్వరాన్ని తన జీవితంలో గుర్తించిన తర్వాత ఫ్రాన్సిస్ గారు తాను నిర్వర్తించవలసిన దైవ కార్యానికి తన సొంత బలం చాలదు అని గ్రహించి ఆత్మ బలం కోసం అడవికి వెళ్లి ఏకాంతంగా ప్రార్థించడం మొదలుపెట్టారు .తనకు ఎదురయ్యే శోధనలను జయించుటకు సువార్త ధ్యానం, మరియు ప్రార్ధన అవసరత ఉందని గ్రహించారు. ఇవేకాక రోమునగరములోని పునీత పేతురు సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠరోగులకు సేవలు చేయాలని తీర్మానించుకున్నాడు.

సిలువధారి సంభాషణ-:

'అస్సిసీకి దిగువన సుమారు ఒక మైలు దూరంలో, శిధిలావస్థలో సాన దమియానో దేవాలయం ఉంది. చుట్టూ గోదుమ పొలాలు, సైప్రస్ వృక్షాలు నాడు నేడూ కూడా ఉన్నాయి. చిన్న కొండ మీద ఉన్న దేవాలయంలో ఆనాడు ఒక్క గురువు మాత్రం బిక్కు బిక్కు మంటూ ఉండేవారు. ఒక రోజు ఫ్రాన్సిస్ ఆ దారిన వెళ్తూ దేవాలయం దగ్గర ఆగాడు. లోపలికి వెళ్లి, గోడకు వేళ్ళాడుతున్న కొయ్య సిలువ ముందు మోకరిల్లి ప్రార్థన చేయసాగాడు, వెంటనే సిలువ మీద యేసు స్వరూపం పెదవులు విప్పి ఇలా అంది. "ఫ్రాన్సిస్ నా ఇంటిని బాగు చెయ్యి" ఆ మాటలు విన్న ఫ్రాన్సిస్ ఎలాంటి అనుభూతిని పొందిఉంటాడో వర్ణించడం సాధ్యం కాదు. ఆ అనుభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవని ఫ్రాన్సిస్ తరువాత తన అశక్తతను వ్యక్తం చేసాడు. అయితే సిలువపై వేళ్లాడే యేసు ప్రభువు ఆనాడే ఫ్రాన్సిస్ హృదయం మీద తమ పంచాగాయాల్ని ముద్రించారని, అవే తరువాత బహిర్గత మైనాయని ఎవరైనా ఊహించవచ్చును. అంతేకాదు ఫ్రాన్సిస్ ఆ దేవాలయంలో ఎంతటి భక్తిప్రపత్తులతో ప్రార్థించి ఉంటాడో కూడా ఉహించవచ్చును.'క్రీస్తు ప్రభువు స్వరం విని తన తండ్రి దగ్గర ఉన్న సొమ్మును( గుర్రాన్ని, పట్టు వస్త్రాలను) అమ్మి  గుడిని బాగు చేయుటకు ఉపయోగించగా తన తండ్రి ఇదంతా ఇష్టపడక ఫ్రాన్సిస్ ను మేత్రాణుల చెంతకు తీసుకుని వెళ్లి వెచ్చించిన ధనమంతా తిరిగి పొంది..ఫ్రాన్సిస్ ను వారసుడిగా జీవించే అధికారం లేదని ఖచ్చితంగా చెప్పేశాడు. 

మేత్రాణుల మాట ఆలకించి తండ్రి ఇచ్చిన ధనాన్ని కూడా ఆయనకు తిరిగి ఇచ్చేసి అతను ధరించిన దుస్తులు కూడా అందరి ముందు విడిచి ఇక నుండి పీటర్ బెర్నార్దాన్ తన తండ్రి కాదని పరలోక‌మందున్న తండ్రియే తన తండ్రి అని బాహాటంగా ప్రకటించారు.. అటు పిమ్మట ధనం, కీర్తి ,ప్రతిష్టల గురించి వెదక్కుండా క్రీస్తులో జీవిస్తూ పేద, నిరుపేదగా పేదరికంలో దారిద్ర్యంలో క్రీస్తు కొరకే జీవించారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని నిర్మించుటకు రాళ్ల కొరకు ధనానికి బిక్షం ఎత్తుతూ తన స్వహస్తాలతో గుడిని పునర్నిర్మించారు...

పిలుపులోని పరమార్థాన్ని గ్రహించడం-:

'ఒకరోజు దివ్యపూజలో పాల్గొంటూ ఉండగా ఫ్రాన్సిసుకు తన భవిష్యత్కాకార్యక్రమాలు బోధపడ్డాయి. బహుశా అది 1208 ఫిబ్రవరి 24వ తేదీ కావచ్చు. ఆ రోజు పునీత మత్తాయసు గారి పండుగ. ఆనాటి సువార్త పఠనమే ఫ్రాన్సిస్ పాలిటి దైవాదేశం అయింది. భవిష్యత్తు మార్గాన్ని చూపింది. "మీరు వెళ్లి దైవరాజ్యం సమీపించినదని బోధించండి మీరు ఉచితంగా పొందారు, కాబట్టి ఉచితంగానే ఇవ్వండి. వెండి బంగారాన్ని ఏ విధమైన ధనాన్ని మీతో ఉంచుకోవద్దు. రెండు అంగీలు గానీ, పాదరక్షలు గానీ ఊతకఱ్ఱకాని మీకు అవసరం లేదు. సేవకుడు భత్యానికి మాత్రమే అర్హుడు. ఏదైనా పట్టణానికి గాని గ్రామానికి కాని వెళ్ళినప్పుడు అక్కడ యోగ్యమైన వాళ్లెవరో వాళ్ళ ఇంటిలో తిరిగి వచ్చేవరకు ఉండండి. ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు ఈ ఇల్లు శాంతి సమాధానాలతో వర్ధిల్లుగాక, అని దీవిస్తూ ప్రవేశించండి. క్రీస్తు తన శిష్యులకిచ్చిన ఈ ఆదేశం ఫ్రాన్సిసులో కొత్త శక్తిని నింపింది. తన మనస్సును కమ్ముకున్న చీకటి తెర తొలగినట్లు అయింది. ఈ సందేశం అర్ధం ఏమిటో నిర్ధారించుకోవడానికి ఫ్రాన్సిస్ అక్కడి గురువునే వివరణ అడిగాడు. క్రీస్తుప్రభువు సత్య సువార్తను బోధించమని తన శిష్యులను ఆదేశించారని, ప్రభు శిష్యులు సర్వదా ప్రభువునే నమ్ముతూ ముందుకు సాగాలని, లౌకిక సంపదలను వారు ఆశించరాదనీ, తమతో వుంచుకోరాదనీ గురువు వివరించాడు ఈ మాటలు విన్నాక ఫ్రాన్సిసుకు పట్టరాని ఆనందం కలిగింది. “ఇదే నేను కోరుకున్నది, ఈ మార్గం కోసమే నేను చిరకాలంగా అన్వేషిస్తున్నాను. ఇక హృదయపూర్వకంగా దీనిని అనుసరిస్తాను" అంటూ ఆ క్షణంలోనే తన చేతి కర్రను, పాదరక్షల్ని పై అంగీని అవతలకు విసిరివేసి. ఒక చౌకబారు వస్త్రంతో చేసిన అంగీని ధరించాడు. అది ఫ్రాన్సిస్ జీవిత యాత్రలో కీలకమైన మలుపు తిరిగిన రోజుతనను దేవుడు పిలిచింది దేవాలయాన్ని బాగుచేయడానికి కాదనీ, శ్రీసభ పునర్నిర్మాణానికి తోడ్పడానికి అని అప్పటికి గ్రహించాడు ఆలస్యం చేయకుండా సువార్త ప్రబోధానికి పూనుకున్నాడు.

తన జీవితాన్ని చూసి కొందమంది ఆయన  సహోదరులుగా, అనుచరులుగా చేరారు. 1209లో 3వ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మరక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకు, భిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతిని ఇచ్చారు. 1219 నాటికి ఫ్రాన్సిస్‌ అనుచరుల సంఖ్య ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిస్‌ స్థాపించిన సభ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈనాడు ప్రపంచమంతటా వారు సేవలను అందిస్తున్నారు.
ఫ్రాన్సిస్‌ చాలా పేద జీవితాన్ని జీవించాడు. ఒక్కోసారి భోజనంలో బూడిద కలుపుకొని తినేవాడు. ఒక్కోసారి రాత్రిళ్ళు ముళ్ళపొదల్లో పడుకొనేవాడు. తన సహోదరుల పట్ల శ్రద్ధగా ఉండేవాడు.వీరు ప్రకృతి ప్రేమికులు దేవుడి సృష్టి అయిన ఈ ప్రకృతి ద్వారా దేవుని మహిమను కీర్తించే వారు. సూర్యుడిని తన సోదరునిగా, చంద్రుడిని తన సోదరిగా, భూమిని తన తల్లిగా సమస్తాన్ని కూడా దేవుని ప్రతిరూపంగా పోల్చి ప్రతినిత్యం దైవత్వాన్ని అన్నింటిలోనూ ఆస్వాదించారు

పంచగాయాలు పొందిన పుణ్యాత్ముడు-:

ఓనాడు ఫ్రాన్సిస్ ప్రార్థనలో నిమగ్నమై ఉండగా.. ప్రకాశవంతమైన వెలుగుతో ఒక దేవదూత ఆకాశం నుండి దిగి వచ్చింది. అతనికి ఆరు రెక్కలున్నాయి.. తన రెండు రెక్కలు చాచాడు మరి రెండు రెక్కలను ముడిచి పైకి ఎత్తాడు. క్రింది రెండు రెక్కలతో ఫ్రాన్సిస్ గారి శరీరాన్ని కప్పేసాడు. సిలువపై వ్రేలాడు తున్న క్రీస్తు ప్రభువు దర్శనమిచ్చారు.. ఈ దర్శనం తర్వాత ఫ్రాన్సిస్ పైకి లేవలేక పోయారు. అద్భుత విధంగా ఫ్రాన్సిస్ వారి శరీరంపై సిలువ నాథుని పంచ గాయాలు ముద్రించబడి ఉన్నాయి.. ఒక హతసాక్షిగా  మరణం పొందుకున్ననూ ప్రభువు శ్రమలలో పాలు పంచుకున్నందుకు ఫ్రాన్సిస్ వారు సంతసించారు.వీరు తమ వృద్ధాప్యంలో 3 అక్టోబర్‌ 1226లో స్వర్గస్తులైనారు. మరణించిన రెండేళ్లకే శ్రీసభ ఫ్రాన్సిస్‌ను పునీతునిగా ప్రకటించింది.‌..

ఆచరణ-:

"శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు" (మత్తయి 5:9)

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారు క్రీస్తును తెలుసుకొని, దైవ వాక్కును తన హృదయంలో నింపుకుని నిరుపేదగా జీవించి, వాక్యం బోధించి ఎన్నో వేల లక్షల మందిని తన శిష్యులుగా చేసుకుని వారి ద్వారా క్రీస్తుని ప్రకటించారు. మనం కూడా పునీత ఫ్రాన్సిస్ జీవితాన్ని మాతృకగా తీసుకుని ప్రభు కోసం జీవిస్తూ, పేదలకు సాయం చేస్తూ ఫ్రాన్సిస్ గారి బాటలో అడుగులు వేద్దాం.. అందరికీ పండుగ శుభాకాంక్షలు...

జోసెఫ్ అవినాష్
కతోలిక రచయిత
పెదవడ్లపూడి విచారణ

Top Post Ad

Below Post Ad