Type Here to Get Search Results !

The Story of Four Candles - ఆగమన కాలంలో నాలుగు కొవ్వొత్తులు


ఆగమన కాలంలో నాలుగు కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

ఈ ఆదివారము నుండి మనము ఆగమన కాలములోనికి ప్రవేశిస్తున్నాము.ఆగమన కాలమనగా రక్షకుని రాకకోసం సిద్ధపడు కాలము.అదే మన విశ్వాసానికి పదును పెట్టుకునే కాలము,మన విశ్వాసాన్ని పరీక్షించుకునే కాలము. ప్రస్తుతము మనము జరుపుకునే ఆగమన కాలం వేరు నాడు యిస్రాయేలు ప్రజలు జరుపుకున్న ఆగమన కాలం వేరు. యిస్రాయేలు ప్రజలు, రక్షకుడు జన్మిస్తాడు. అతని ద్వారా రాజ్య పాలనము చేయబడుతుంది. మనందరి జీవితాలు పాపపు బానిసత్వం నుండి స్వతంత్ర జీవితం లోనికి ప్రవేశిస్తాయి అని 'యేసు' ప్రభువు కొరకు ఎదురు చూశారు. కాని, ప్రస్తుత కాలమునకు చెందిన మనము జరుపుకునే ఆగమన కాలం రెండవ రాకడ'కు సంబంధించినది...

ఈకాలములోని ఆదివారములు ఆగమన కాలపు 1,2,3,4వ ఆదివారములుగా శ్రీసభ పరిగణిస్తుంది..

కతోలిక శ్రీసభ సాంప్రదాయంలో కొవ్వొత్తి ఒక భాగం.ఈ చీకటి ప్రపంచానికి క్రీస్తు వెలుగుగా వచ్చారన్న సత్యాన్ని కొవ్వొత్తి వెలుగు తెలియపరుస్తుంది. ఆగమన కాలంలో చక్ర మాలిక చుట్టూ నాలుగు కొవ్వొత్తులు మధ్యలో మరొక కొవ్వొత్తిని అమరుస్తారు.నాలుగు కొవ్వొత్తులు ఆగమనకాల నాలుగు ఆదివారాలను తెలియపరుస్తాయి. మధ్యన ఉన్న కొవ్వొత్తి క్రీస్తే వెలుగు అని సూచిస్తుంది. ఈ కొవ్వొత్తులలో మొదటి రెండు ఊదా రంగును, మూడవది గులాబీ రంగును నాలుగోది ఊదా రంగును ఐదోది తెలుపు రంగును కలిగి ఉంటాయి.మొదటి నాలుగు కొవ్వొత్తులు నాలుగు వారాలు వెలిగిస్తే ఐదో కొవ్వొత్తిని మాత్రం క్రిస్మస్ జాగరణ(అర్ధరాత్రి) పూజలో వెలిగిస్తారు

నాలుగు కొవ్వొత్తులు- నాలుగు పరమార్ధాలు-:

1. మొదటి కొవ్వొత్తి (Hope- నమ్మకం) :

మొదటివారం వెలిగించే ఊదా రంగు కొవ్వొత్తిని "నిరీక్షణ కొవ్వొత్తి" (candel of hope) అని అంటారు. దీనిని ప్రవచనా కొవ్వొత్తి అని కూడా పిలుస్తాము.తరతరాలుగా ఎదురుచూసిన మహత్తరమైన కార్యం దేవుని ప్రేమను బట్టి కార్యరూపం దాల్చింది. దైవవాక్కు శరీరధారి అయ్యెను, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు నెరవేరాయి రక్షకుడు మన కోసం పుట్టారు అని నమ్మి అదే నమ్మకాన్ని యేసుని రెండవ రాకడకై ఎదురు చూస్తూ పూర్వనిబంధన ప్రజల స్థితిగతులను ధ్యానిస్తూ మొదటి కొవ్వొత్తిని వెలిగిస్తాం...

2. రెండవ కొవ్వొత్తి (శాంతి - Peace) :

గతవారం మనమంతా కూడా క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడి, క్రీస్తురాజు ప్రేమరాజు, శాంతిని స్థాపించిన శాంతిరాజు అని విశ్వాసించాము...ఆగమన కాలం రెండవ వారం మనం "శాంతి" అనే అంశాన్ని ధ్యానిస్తాము..

"శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను"(యోహాను 14:27) అన్న ప్రభువు మాటకు నిదర్శనంగా శాంతిరాజుగా జన్మించిన క్రీస్తు ప్రభువు అందరి జీవితాల్లో శాంతిని, ధైర్యాన్ని నింపాలని ఈ రెండవ కొవ్వొత్తి వెలిగిస్తూ ప్రార్థిస్తాము.. 

3. మూడవ కొవ్వొత్తి (Joy- సంతోషం):

మూడవ వారం వెలిగించే గులాబీ రంగు కొవ్వొత్తిని కాపరి కొవ్వొత్తి(candle of joy) అని పిలుస్తాము.గాబ్రియేలు సన్మానస్కుని శుభవర్తమానం ద్వారా గొల్లలు పొందిన ఆనందాన్ని అనుభూతిని సూచిస్తుంది.ఈ ఆనందంలో మనల్ని కూడా పాలుపంచుకోమని ఆహ్వానిస్తుంది. క్రీస్తుని జన్మదినం సర్వమానవాళికి శుభదినం సంతోష దినం ఆ సంతోషంతోనే ఈ వత్తిని వెలిగిస్తాం

4. నాలుగో కొవ్వొత్తి - (Love - ప్రేమ)

నాలుగో వారం వెలిగించే ఊదా రంగు కొవ్వొత్తిని ప్రేమ కొవ్వొత్తి (candel of love) అని పిలుస్తాము.దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి కేవలం మన రక్షణార్థమై తన ఏకైక కుమారుడిని మరియ తల్లి ద్వారా ఈ భువి పైకి పంపారు. క్రీస్తు మానవుడిగా భువిపై అవతరించి మన అందరిని ప్రేమించి మన కోసం తన అమూల్యమైన ప్రాణాలను ధారపోశారు. క్రీస్తు ప్రేమ ప్రతి హృదయంలో నింపబడాలని ఈ వత్తిని వెలిగిస్తాం..

క్రీస్తు జయంతి కొవ్వొత్తి-:

క్రిస్మస్ జాగరణ పూజలో మహిమ గీతం పాడుతూ ఉండగా, పశువుల పాకలో ఉదయించిన బాల యేసును ఆరాధించిన తదుపరి మధ్యలో ఉన్న తెలుపు రంగు కొవ్వొత్తిని వెలిగిస్తారు. ఈ తెలుపు కొవ్వొత్తి క్రీస్తే ఈ లోకానికి వెలుగు అని సూచిస్తుంది.(యోహాను 8:12) లో "లోకానికి వెలుగును నేనే" అన్న క్రీస్తు మాటలను నెరవేరుస్తుంది..

Top Post Ad

Below Post Ad